ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందు టీమిండియాకు ఊహించ‌ని అనుభ‌వం!

  • వివ‌రాలు తెలిపిన ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్. శ్రీధర్
  • ఆట‌గాళ్ల కుటుంబాలను అనుమ‌తించ‌బోమ‌న్న ఆస్ట్రేలియా అధికారులు
  • ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ర‌విశాస్త్రి
  • వారితో ఎలా డీల్ చేయాలో త‌న‌కు తెలుస‌ని వ్యాఖ్య‌
  • చివ‌ర‌కు ఒప్పుకున్న ఆస్ట్రేలియా
ప్ర‌స్తుతం టీమిండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఆ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందు ఎదురైన ఓ అనుభ‌వాన్ని గురించి  ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్ కీల‌క వివ‌రాలు తెలిపారు. ఐపీఎల్‌ పూర్తయిన అనంత‌రం టీమిండియా ఆటగాళ్లు 48 గంటలు క్వారంటైన్‌లో ఉన్నారని ఆయ‌న వివ‌రించారు.

అనంత‌రం పలువురు ఆటగాళ్లు తమ కుటుంబాలను తీసుకుని ఆసీస్‌ పర్యటనకు వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నారని, అయితే, ఉన్న‌ట్టుండి ఆస్ట్రేలియా అధికారులు భార‌త‌ ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించ‌బోమ‌ని చెప్పారని తెలిపారు. దీంతో రవిశాస్త్రి ఇందులో జోక్యం చేసుకున్నార‌ని శ్రీధ‌ర్ వివ‌రించారు.  

బీసీసీఐ అధికారులతో ఈ విష‌యంపై చర్చించి, వారిని ఒప్పించారని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఆసీస్ నుంచి ప‌దేప‌దే ఫోన్‌ ‌కాల్స్‌ వచ్చాయని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార‌త ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించబోమని వారు స్పష్టం చేశారని  అన్నారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ర‌విశాస్త్రి తాము ఆస్ట్రేలియా పర్య‌ట‌న‌కు వెళ్లబోమని చెప్పార‌ని వివ‌రించారు.  

తాను 40 ఏళ్లుగా ఆస్ట్రేలియాకు వెళ్తున్నానని అన్నారు. అక్కడి పరిస్థితులు త‌న‌కు తెలుస‌ని, వారిని ఎలా ఒప్పించాలనే విషయాలు కూడా బాగా తెలుస‌ని రవిశాస్త్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారన్నారు. చివ‌ర‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియాను బీసీసీఐ అధికారులు ఒప్పించడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్పటికప్పుడు అనుమతులు ఇచ్చార‌ని శ్రీధర్ తెలిపారు.


More Telugu News