సమావేశానికి హాజరు కాని పంచాయతీ అధికారులు... నిమ్మగడ్డ ఆగ్రహం!

  • ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
  • నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు 
  • ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో సమావేశం
  • సీఎంతో అపాయింట్ మెంట్ ఉందన్న అధికారులు
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం వివాదాల మయంగా మారింది. స్థానిక ఎన్నికలపై ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య తీవ్రపోరాటం జరుగుతున్న నేపథ్యంలో, తాజాగా పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల వైఖరి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఆగ్రహం కలిగించింది.

ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా, ఆ విషయం చర్చించేందుకు ఎస్ఈసీ... రాష్ట్ర పంచాయతీరాజ్ ఉన్నతాధికారులైన గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లను సమావేశానికి ఆహ్వానించారు. వాస్తవానికి ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగాల్సి ఉండగా, ద్వివేది, గిరిజాశంకర్ రాలేదు.

దాంతో మరో అవకాశం ఇస్తూ సమావేశం సమయాన్ని సాయంత్రం 5 గంటలుగా నిర్దేశించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీ రాజ్ అధికారులకు మెమో జారీ చేశారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సమావేశానికి రాకపోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ మండిపడ్డారు. తమ ఆదేశాలను పాటించని అధికారులపై ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో అపాయింట్ మెంట్ ఉన్న కారణంగా తాము సమావేశానికి రాలేమని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.


More Telugu News