టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బీజేపీ పిలుపు.. భారీగా మోహరించిన పోలీసులు

  • రామ మందిర నిర్మాణంపై విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • మండిపడుతున్న బీజేపీ శ్రేణులు
  • ఈ రోజే మెట్ పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రులు
అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలను సేకరించడంపై టీఆర్ఎస్ మెట్ పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాముడు మనకు అవసరమా? అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో భిక్షమెత్తుకుంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. మెట్ పల్లిలోని విద్యాసాగర్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులు మెట్ పల్లికి చేరుకున్నారు.

మరోవైపు ఇదే సమయంలో మెట్ పల్లి నియోజకవర్గంలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులలో వారు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బీజేపీ నేతల విమర్శలతో విద్యాసాగర్ రావు వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.


More Telugu News