వింత వ్యాధి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం: మంత్రి ఆళ్ల నాని తీవ్ర వ్యాఖ్యలు

  • పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం
  • 54కి పెరిగిన కేసుల సంఖ్య
  • బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని
  • రాజకీయ స్వార్థం కోసం కుట్రకు తెరలేపారన్న నాని
  • ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని హితవు
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో మొదలైన వింత వ్యాధి ఇప్పుడు దెందులూరు మండలం కొమిరేపల్లికి కూడా వ్యాపించింది. దీనిపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వింత వ్యాధి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం కలుగుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు వింత వ్యాధి కుట్రకు తెరలేపారని సందేహంగా ఉందని పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి దేవుళ్లను కూడా లాగారని, ఇప్పుడు ప్రజలను కూడా లాగుతున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని అన్నారు. దెందులూరు మండలం కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. వింత వ్యాధి బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వింత వ్యాధికి గురైన వారి సంఖ్య 54కి పెరిగింది. ఇవాళ పొలం పనులకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వారు కూడా వింత వ్యాధితోనే మరణించారని కుటుంబ సభ్యులు అంటున్నారు. వీరికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. కాగా, ఓ ఆసుపత్రిలో మంత్రి ఆళ్లనాని పరామర్శిస్తున్న సమయంలోనే ఓ మహిళ స్పృహ కోల్పోవడంతో ఆందోళన నెలకొంది.


More Telugu News