జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలి: నారా లోకేశ్

  • లాక్ డౌన్ వేళ చీరాలలో కిరణ్ అనే యువకుడి మృతి
  • తాజాగా లోకేశ్ ను కలిసిన కిరణ్ కుటుంబసభ్యులు
  • కిరణ్ కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదన్న లోకేశ్
  • మరే కుటుంబానికి ఇలా జరగకూడదని ఉద్ఘాటన
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అనే యువకుడు మృతి చెందడం తెలిసిందే. తాజాగా కిరణ్ కుటుంబ సభ్యులు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను కలిశారు. దీనిపై లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతూనే ఉందని విమర్శించారు.

మాస్కు పెట్టుకోలేదని చీరాల పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడు కిరణ్ ను కొట్టి చంపారని లోకేశ్ ఆరోపించారు. ఏడు నెలలు అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని, హత్య చేసిన పోలీసులకు శిక్ష పడలేదని తెలిపారు. వైసీపీ నాయకుడి బంధువు అనే కారణంతో ఎస్సైని కాపాడే ప్రయత్నం చేయడం దారుణమని పేర్కొన్నారు.

కిరణ్ కు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగడానికి వీల్లేదని లోకేశ్ ఉద్ఘాటించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకం సృష్టిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రత్యక్ష, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.


More Telugu News