హిమాచల్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు

  • ఇవాళ చివరి దశ పోలింగ్
  • ఇప్పటికే రెండు దశలు పూర్తి
  • పురుషుల కంటే మహిళల ఓటింగ్ అధికం
  • ఓటేసిన 46 మంది కరోనా రోగులు
  • శుక్రవారం ఓట్ల లెక్కింపు
దేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న సమయంలోనే హిమాచల్ ప్రదేశ్ లో నేడు పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ నిర్వహించారు. ఈ మూడో దశ పోలింగ్ లో 80.20 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. గత రెండు దశల పోలింగ్ కంటే ఈసారి అత్యధికంగా ఓట్లు నమోదైనట్టు గుర్తించారు. అంతేకాదు, పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్టు వెల్లడైంది. 78.20 శాతం పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, 82.30 శాతం మంది మహిళలు ఓటు హక్కు ఉపయోగించుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో వార్డు మెంబర్లు, ఉప ప్రధాన్, ప్రధాన్, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా, 46 మంది కరోనా రోగులు కూడా ఓట్లేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు 57 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 55,540 మంది కోలుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద 967 మంది మరణించారు.


More Telugu News