'సీరం' అగ్నిప్రమాదంలో ఐదుగురి దుర్మరణం... తీవ్ర విచారం వ్యక్తం చేసిన అదార్ పూనావాలా

  • పూణేలోని సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం
  • ఐదుగురి మృతదేహాలు వెలికితీశామన్న అగ్నిమాపక సిబ్బంది
  • అత్యంత దురదృష్టకరమన్న పూనావాలా
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బాగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను తాము వెలికితీశామని అగ్నిమాపక దళానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ అదనపు ఉత్పత్తి కోసం సీరం సంస్థ నిర్మిస్తున్న భనవంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. 10 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. కాగా, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనావాలా ఐదుగురి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే తొలుత ట్వీట్ చేసిన ఆయన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు. అయితే, మృతదేహాల వెలికితీత అనంతరం మరో ట్వీట్ చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని వివరించారు.


More Telugu News