ప్రభుత్వ అండతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి: కన్నా

  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు
  • నా 40 ఏళ్ల జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు
  • ఏపీలో పోలీసు వ్యవస్థ బలహీనంగా ఉంది
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని తాను ముందు నుంచి చెపుతున్నానని అన్నారు. విపక్ష నేతల గృహ నిర్బంధాలే దీనికి నిదర్శనమని చెప్పారు.

అసలు ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి దారుణమైన ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. మంత్రులు చేస్తున్న దూషణలే ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమని చెప్పారు.

ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా బలహీన పడిందని కన్నా అన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఒకప్పుడు ఏపీలోని పోలీసు వ్యవస్థ అంటే దేశానికి ఆదర్శంగా ఉండేదని... ఇప్పుడు దారుణ స్థితిలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాలు, ఓటర్లకు డబ్బు పంచడం ద్వారా ఎన్నికల్లో గెలవచ్చనే భావనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.

విగ్రహాల విధ్వంసం వెనుక ఉన్న దోషులు ఎవరో ప్రభుత్వం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. ప్రభుత్వం అండతోనే విగ్రహాలపై దాడులు జరిగాయని అన్నారు. నిజమైన ఫ్యాక్షనిస్ట్ పాలన ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 


More Telugu News