న్యాయ‌మూర్తులు మారినంత మాత్రాన న్యాయం మార‌దు: హైకోర్టు తీర్పుపై చంద్ర‌బాబు కామెంట్ ‌

  • పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా వ‌ద్దంటారేమో
  • జ‌గ‌న్ కు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పైనే న‌మ్మ‌కం లేదు: చ‌ంద్ర‌బాబు
  • స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుంది
  • మా పార్టీ ఎన్నిక‌ల‌కు ఎల్ల‌ప్పుడూ సిద్ధమే: అచ్చెన్నాయుడు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పంచాయతీ ఎన్నిక‌లు నిర్వహించాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. న్యాయ‌మూర్తులు మారినంత మాత్రాన న్యాయం మార‌ద‌ని వ్యాఖ్యానించారు.

అస‌లు రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘ‌మే వ‌ద్ద‌నే రీతిలో ముఖ్యమంత్రి వ్య‌వ‌హ‌రించార‌ని ఎద్దేవా చేశారు. మ‌రింత ముందుకు వెళ్లి పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కూడా వ‌ద్దంటారేమోన‌ని చుర‌క‌లంటించారు. జ‌గ‌న్ కు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పైనే న‌మ్మ‌కం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. గ‌తంలో క‌రోనా విజృంభ‌ణ అధికంగా ఉన్న స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వహించాల‌ని చూసి, ఇప్పుడేమో మ‌ళ్లీ అదే క‌రోనా సాకుతో వ‌ద్ద‌ని అన్నార‌ని విమ‌ర్శించారు.

హైకోర్టు తీర్పు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు అని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ తీరు వ‌ల్ల‌ దేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పరువు పోయింద‌ని చెప్పారు. ఈ ప్ర‌భుత్వం ఎన్నో తప్పులు చేసింద‌ని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుంద‌ని, దీంతో ప్ర‌భుత్వానికి కాస్త‌యినా సిగ్గు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని చెప్పారు.

హైకోర్టు చా‌రిత్రాత్మ‌క‌మైన తీర్పు ఇచ్చింద‌ని, ఆ తీర్పును త‌మ పార్టీ స్వాగ‌తిస్తోంద‌ని తెలిపారు. త‌మ పార్టీ ఎన్నిక‌ల‌కు ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌ని చెప్పారు. జ‌గ‌న్ మాత్రం వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని విమర్శిస్తున్నారు. గ‌తంలో క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌లు వాయిదా వేయడాన్ని త‌ప్పుబ‌ట్టి, ఎస్ఈసీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ నేత‌లు, ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా సాకుతో ఎన్నిక‌లు వ‌ద్దంటున్నార‌ని చెప్పారు.  


More Telugu News