సెన్సెక్స్​ సెన్సేషన్​.. 50 వేల మార్కు దాటిన బీఎస్​ఈ!

  • చరిత్ర రికార్డులు తిరగరాసిన మార్కెట్లు
  • ఓపెన్ అయిన కాసేపటికే పైపైకి
  • 300 పాయింట్లు ఎగబాకి 50,127 స్థాయికి
  • వంద పాయింట్లు లాభపడిన నిఫ్టీ
సెన్సెక్స్ సెన్సేషన్ సృష్టించింది. బుల్ రంకె వేసింది. మార్కెట్ల చరిత్రలోనే మొట్టమొదటి సారిగా 50 వేల మార్కును అందుకుంది. 30 కంపెనీలను కలిగివుండే బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ (బీఎస్ఈ) సూచీ ఓపెన్ కావడంతోనే దాదాపు 300 పాయింట్లు పైకెగిసి.. 50,127 పాయింట్లను తాకింది. ఇక, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ (నిఫ్టీ) కూడా వంద పాయింట్లు పెరిగి.. ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా 14,738 పాయింట్లకు చేరింది.

బీఎస్ఈలో బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ బాగా లాభపడ్డాయి. సగటున ఒక్కో కంపెనీ షేరు విలువ 1.43 శాతం దాకా పెరిగింది. ఎన్ఎస్ఈలోని ఉప సూచీలూ సానుకూల పథంలోనే పయనిస్తున్నాయి. ఇందులో ఐటీ షేర్లలో జోరు కనిపించింది. సగటున 1 శాతంపైనే ఐటీ షేర్లు పెరిగాయి. నిజానికి కరోనా మహమ్మారితో గత ఏడాది మార్చి 24న బీఎస్ఈ 25,638 పాయింట్లకు పడిపోయింది. ఇప్పుడు దాదాపు 10 నెలల్లో రికార్డులు తిరగరాస్తూ దానికి రెట్టింపు స్థాయికి చేరింది.

ఇవీ కారణాలు...

అమెరికా కొత్త అధ్యక్షుడిగా బుధవారమే జో బైడెన్ ప్రమాణం చేశారు. ఒడిదుడుకుల్లో ఉన్న అమెరికా ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని, మరింత సహకారం అందిస్తామని ఆయన ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చర్యలు చేపడితే ఆసియా దేశాల నుంచి ఎగుమతులు పెరిగి వ్యాపారం ఊపందుకుంటుందనే సానుకూల పవనాలు మార్కెట్ లో వీచాయి. సూచీలు పెరిగాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మన సూచీలు అదేస్థాయిలో దూసుకెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. డౌ జోన్స్, నాస్ డాక్, ఎస్ అండ్ పీలు చరిత్ర రికార్డులను తిరగరాశాయి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ వంటి కంపెనీల కార్పొరేట్ ఆర్జన పెరగడంతో దలాల్ స్ట్రీట్ లో బుల్ పరుగులు పెట్టిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మరికొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అందులో ఆర్థిక రంగ పునరుత్తేజం కోసం ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడుతుందన్న ఆశాభావమూ మార్కెట్లలో సానుకూల సంకేతాలకు కారణమైంది.

మార్కెట్ లోకి విదేశీ నిధులు భారీగా రావడమూ సూచీలు అత్యధిక స్థాయికి చేరడానికి కారణమైంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం నికర విదేశీ నిధుల రాక విలువ రూ.2,289 కోట్లు. అదే సమయంలో దేశీ నిధుల ఫ్లో (నెట్ సెల్లర్స్) రూ.865 కోట్లుగా ఉంది. మంగళవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నెట్ బయ్యర్లుగా ఉన్నారు. రూ.257.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (ఐఆర్ఎఫ్ సీ) మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఆఫర్ కు వచ్చింది. సంస్థ విలువను రూ.4,633 కోట్ల నిధి సమీకరణే లక్ష్యంగా ఐపీవోకు ఎంటర్ అయ్యింది. ఎన్ బీఎఫ్ సీలోని వాటాను అమ్మడం ద్వారా రూ.1,544 కోట్లు రాబట్టాలని కేంద్ర ప్రభుత్వం, తాజా మూలధన పెట్టుబడులకు రూ.3,089 కోట్ల సమీకరణను రైల్వే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో బుధవారం సంస్థ షేర్ హోల్డర్ల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది.


More Telugu News