నేపాల్, శ్రీలంక‌లకు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు పంపిన భారత్

  • కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల త‌ర‌లింపు
  • ఈ రోజు ముంబై నుంచి పంపిన అధికారులు
  • నేపాల్‌కు మొత్తం 10 లక్షల డోసులు
  • బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులు
భార‌త్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లను భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ లకు ఉచితంగా అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజ‌న్యంతో పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను ఈ రోజు ఉదయం నేపాల్‌ రాజధాని ఖాట్మాండుతో పాటు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు పంపించారు.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో వీటిని పంపారు. మొద‌టి ద‌శ‌లో నేపాల్‌కు మొత్తం 10 లక్షలు, బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులను పంపుతున్నారు.‌ కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో పొరుగున ఉన్న ఆయా దేశాల‌కు భారత్ ఇప్ప‌టికే ఔష‌ధాలు, వైద్య ప‌రిక‌రాల‌ను కూడా పంపిన విష‌యం తెలిసిందే. భారత్‌ నుంచి మొత్తం 30 మిలియన్‌ డోసుల ‘కోవిషీల్డ్‌’ను కొనుగోలు చేసేందుకు శ్రీలంక ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది.


More Telugu News