రామమందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలి.. ఇందులో రాజకీయాలు వద్దు: బండి సంజయ్

  • దేశ వ్యాప్తంగా జనజాగరణ ద్వారా నిధి సేకరణ జరుగుతోంది
  • ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందువు విజయవంతం చేయాలి
  • హిందూ సమాజం సంఘటితం కావాలి
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం హిందువులందరూ విరాళాలను ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. శ్రీరామ తీర్థ టస్ట్ ఆధ్వర్యంలో నిధి సేకరణ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. విరాళాల సేకరణ కార్యక్రమాన్ని హైదరాబాదులోని బోరబండలో బండి సంజయ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... 'అయోధ్య రామమందిరం కోసం శ్రీరామ తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జనజాగరణ ద్వారా నిధి సేకరణ కార్యక్రమం జరుగుతోంది. అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన జన జాగరణ నిధి సేకరణ మహత్తర కార్యక్రమంలో భాగంగా బోరబండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి హిందువు కుటుంబాన్ని ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతోంది.

ఈ కార్యక్రమం రామరాజ్య స్థాపనకు ప్రతీక, నాంది. గతంలో కొంతమంది కుహనా లౌకికవాదులు భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తెరమరుగు చేసేందుకు కుట్రలు చేశారు. హిందూ ధర్మం, దేవాలయాలు, సంస్కృతి పట్ల దాడులు చేస్తున్న దురాక్రమణదారులకు ఒక హెచ్చరిక జారీ చేసేలా రామమందిర నిర్మాణం జరగబోతోంది. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం కోసం 4 లక్షల మంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారు.

రామరాజ్య స్థాపనే ధ్యేయంగా మహాత్ముడు భగవద్గీత చేతబూని దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆ మహాత్ముడి ఆకాంక్షలకు అనుగుణంగా, కరసేవకుల త్యాగాలను సాకారం చేసుకునేలా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు కాషాయ జెండాను చేతబూని జనజాగరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రామమందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి. హిందూ సమాజం సంఘటితం కావాలి. భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆ రాముడి కృపకు పాత్రులు కావాలి. దీన్ని ఎవ్వరూ రాజకీయ కోణంతో చూడొద్దు' అని ట్వీట్ చేశారు.


More Telugu News