ప‌ద‌వి నుంచి దిగిపోతున్నందుకు ట్రంప్.. డెలావర్ వీడుతున్నందుకు బైడెన్.. భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు

  • అధ్యక్షుడిగా ప‌ని చేయ‌డం గౌరవంగా భావిస్తున్నా
  • అమెరికా నాయత్వాన్ని అంతర్జాతీయంగా బలపర్చాం: ట్రంప్ 
  • డెలావర్ ఎప్పుడూ నా హృద‌యంలోనే  ఉంటుంది
  • ప్ర‌మాణం చేసేందుకు పంపుతున్నందుకు సంతోషం: బైడెన్
అగ్ర‌రాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఈ రోజు  రాత్రి 10.30 (భార‌త కాల‌మానం ప్ర‌కారం)గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం చేయనున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత‌సౌధాన్ని వీడుతున్నారు. ఈ సందర్భంగా  జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద వీడ్కోలు సందేశాన్ని ఇచ్చారు. కొత్తగా వచ్చే పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.  

అమెరికా అధ్యక్షుడిగా ప‌ని చేయ‌డం గౌరవంగా భావిస్తున్నాన‌ని, ఈ అవకాశాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌ని అన్నారు. కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుందని, వారు పాల‌న‌లో విజయం సాధించాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి వంటి ఘటనలను సహించేదిలేదని అన్నారు. ఆ దాడితో అమెరికా ప్ర‌జ‌లంతా భయాందోళనల‌కు గురయ్యారని తెలిపారు. రాజకీయ హింస అనేది దేశ‌ విలువలపై దాడి చేయడంతో సమానమ‌ని చెప్పారు. విదేశాంగ విధానంపై ఆయ‌న మాట్లాడుతూ... అమెరికా నాయత్వాన్ని అంతర్జాతీయంగా బలపర్చామ‌ని తెలిపారు.

ప్ర‌పంచం మొత్తం మళ్లీ అమెరికాను గౌరవించడం ప్రారంభించిందని చెప్పారు. ఈ హోదాను అమెరికా ఎప్పటికీ కోల్పోకూడదని అన్నారు. తాము ప‌లు దేశాలతో ఉన్న సంబంధాలను పునరుద్ధరించామ‌ని, చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టామ‌ని తెలిపారు. అంతేగాక‌, మధ్యప్రాచ్యంలో అనేక శాంతి ఒప్పందాలను  కుదిర్చేందుకు కృషి చేశామ‌ని చెప్పారు.

గత కొన్ని దశాబ్దాల చరిత్రలో ఎటువంటి యుద్ధాలూ ప్రారంభించని తొలి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. అమెరికాకు బయటి శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు.

అమెరికా ప్రజలు దేశం గొప్పతనంపై విశ్వాసం కోల్పోతుండ‌డం కూడా అమెరికాకు పెద్ద ముప్పని తెలిపారు. అసమ్మతివాదులు గ‌ళాన్ని విప్ప‌కుండా అణచివేయాలనుకోవడం అమెరికా విలువలకే విరుద్ధమంటూ త‌న‌పై ప‌లు సామాజిక మాధ్య‌మాలు విధించిన బ్యాన్ ను ప్ర‌స్తావిస్తూ వ్యాఖ్య‌లు చేశారు.  
 
బైడెన్ భావోద్వేగం

ఈ రోజు రాత్రి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో జో బైడెన్ వాషింగ్టన్‌కు బయల్దేరుతూ  డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో భావోద్వేగభ‌రితంగా మాట్లాడారు. త‌న‌ చివరి శ్వాస వరకు డెలావర్ ఎప్పుడూ త‌న హృద‌యంలోనే ఉంటుందని చెప్పారు. తాను ఇక్క‌డి నుంచి వెళ్తుండ‌డం త‌న‌ను బాధిస్తున్నప్ప‌టికీ, త‌న‌ను ప్ర‌జ‌లు అధ్యక్షుడిగా ప్ర‌మాణం చేసేందుకు పంపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.


More Telugu News