ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రంపై భారాన్ని తగ్గించండి: అమిత్ షాతో జగన్ మొర

  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ ఇవ్వండి
  • ఏపీలో డిస్కంల పరిస్థితి ఏమంత బాగోలేదు
  • పోలవరం బకాయిలు చెల్లించండి
  • తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించండి
  • 16 అంశాలతో వినతిపత్రం సమర్పించిన జగన్
గత రాత్రి ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు గంటకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏపీని ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. అలాగే, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.  అమిత్ షాతో భేటీ అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంది.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ కూడా పేర్కొన్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిసెంబరులో షాను కలిసినప్పుడు 13 అంశాలను ప్రస్తావించిన సీఎం.. ఇప్పుడు వాటికి మరో మూడు అంశాలను కలిపి మొత్తం 16 అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఇందులో పోలవరం, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, పెండింగ్ నిధులు తదితర అంశాలున్నాయి.

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లకు ఆమోదించాలని, అలాగే, 2018 నుంచి చెల్లించాల్సిన రూ. 1,644.23 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని వినతిపత్రంలో కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు 2014-15లో రెవెన్యూ లోటు బకాయిలను విడుదల చేయాలని, ఏపీలో డిస్కంల పరిస్థితి ఏమంత బాగోలేదని, విద్యుత్‌ను సరెండర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని, తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ. 5,541 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు.

వీటితోపాటు దిశ బిల్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాలకు అనుమతి ఇవ్వాలని, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని అమిత్ షాకు సమర్పించిన వినతిపత్రంలో జగన్ పేర్కొన్నారు.


More Telugu News