ఆసీస్ ను చిత్తుచేసిన టీమిండియాకు రూ.5 కోట్ల బోనస్ ప్రకటించిన బీసీసీఐ

  • బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఘనవిజయం
  • నాలుగు టెస్టుల సిరీస్ భారత్ వశం
  • ఆటగాళ్లకు బోర్డు నజరానా
  • ఇది వెలకట్టలేని విజయం అన్న గంగూలీ
ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై అది కూడా టెస్టుల్లో ఓడించడం ఏమంత సులువు కాదు. ఆటలో నైపుణ్యం కంటే ఆటగాళ్ల నిబ్బరానికి పరీక్ష పెట్టే పరిస్థితులు ఆసీస్ లో ఎదురవుతాయి. అయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ భారత కుర్రాళ్ల జట్టు ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ ను 2-1తో సగర్వంగా గెలుచుకుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ విజయం దక్కిందో గుర్తించిన బీసీసీఐ భారత జట్టుకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.

బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఇదేమీ మామూలు విషయం కాదు. కోహ్లీ లేడు, ప్రపంచస్థాయి పేసర్లు బుమ్రా, షమీ, ఉమేశ్ లేరు... ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, అశ్విన్ లేరు... అయినప్పటికీ కొండను పిండి చేశారు. పంత్, నటరాజన్, సిరాజ్, సుందర్, ఠాకూర్ అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకుని ఆసీస్ ను సొంతగడ్డపైనే కంగుతినిపించారు.

దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, ఆటగాళ్లకు బోర్డు తరఫున రూ.5 కోట్ల బోనస్ ప్రకటించినా, వారు సాధించింది వెలకట్టలేని విజయం అని కొనియాడారు. భారత క్రికెట్ చరిత్రలో ఈ విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు.


More Telugu News