కరోనా టీకాపై కీలక ప్రకటన చేసిన భారత్ బయోటెక్!

  • మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే కొవాగ్జిన్ కు అనుమతి
  • ఫ్యాక్ట్ - షీట్ ను విడుదల చేసిన భారత్ బయోటెక్
  • టీకా ఎవరు తీసుకోరాదో తెలియజేస్తూ ప్రకటన
మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, తాము తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్, టీకా ఎవరు తీసుకోకూడదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కీలక ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ఓ ఫ్యాక్ట్ - షీట్ ను సంస్థ మీడియాకు విడుదల చేసింది.

కరోనా టీకా తీసుకున్న వారిలో దాదాపు 580 మంది తీవ్రమైన దుష్ప్రభావాలకు గురికాగా, ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకాకు ఎవరు దూరంగా ఉండాలన్న విషయాన్ని భారత్ బయోటెక్ ప్రకటించింది. గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్ ను తీసుకోవద్దని సలహా ఇచ్చింది.

ఇదే సమయంలో కొవాగ్జిన్ కాకుండా మరో వేరియంట్ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా టీకాకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్ ఆఫీసర్ లకు తప్పనిసరిగా తెలియజేయాలని, వారి సలహా, సూచనల మేరకు నడచుకోవాలని కోరింది.


More Telugu News