డ్యూటీలో వెరైటీ... సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్!

  • మధ్యప్రదేశ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా రంజిత్ సింగ్
  • మూన్ వాక్ డ్యాన్స్ చేస్తూ విధులు
  • లోకల్ సెలబ్రిటీగా మారిన వైనం
మధ్యప్రదేశ్ లోని ఓ కానిస్టేబుల్, తన విధి నిర్వహణలో భాగంగా వెరైటీని చూపుతూ, సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యాడు. ఇండోర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రంజిత్ సింగ్ అనే వ్యక్తి, మైఖేల్ జాక్సన్ కు పేరు తెచ్చిన 'మూన్ వాక్'ను రోడ్డుపై ప్రదర్శిస్తూ, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడమే అతన్ని నలుగురికీ తెలిసేలా చేసింది. ఇప్పుడు రంజిత్ స్థానిక సెలబ్రిటీ. ఎంతో మంది అతని వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుదామని కోరుతూ, అతనితో మాట్లాడి అభినందిస్తున్నారు. అయితే, రంజిత్ కావాలనే ఇలా చేయడం ప్రారంభించలేదు. దీని వెనుక ఓ విషాదం ఉంది.

"నేను ఇలా డ్యాన్స్ చేస్తూ పనిచేయడాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించాను. అప్పట్లో ఒక రోజు నాకు ఓ మెసేజ్ వచ్చింది. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ జామ్ అయిందని, నేను వెళ్లి నియంత్రించాలని ఆదేశాలు అందాయి. నేను అక్కడికి వెళ్లి చూస్తే, ప్రమాదంలో మరణించింది నా స్నేహితుడే కావడంతో హతాశుడిని అయ్యాను. ఎంతో భయం వేసింది. అటూ ఇటూ పరిగెడుతుంటే, ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చింది. అప్పుడు నా పై అధికారి వచ్చి, నా చేష్టల కారణంగానే ట్రాఫిక్ అదుపు చేయబడిందని చెప్పాడు. నేను స్వతహాగా డ్యాన్సర్ ను కావడంతో, ఈ పద్ధతిలో ట్రాఫిక్ ను కట్టడి చేయడం ప్రారంభించాను" అని రంజిత్ తెలిపాడు.

తన నృత్యంతో ట్రాఫిక్ ను మరింతగా నియంత్రించగలుగుతున్నానని, ప్రయాణికులు ఒక్క క్షణం ఆగి, నన్ను చూసి కొంతైనా ఆనందపడి, తమ మోముల్లో చిరునవ్వు చిందిస్తూ వెళుతుంటారని చెప్పుకొచ్చాడు. ప్రయాణికులు కాస్తంత బాధలో ఉన్నా, వారు నా నృత్యం చూసి సాంత్వనకు గురవుతారని అన్నాడు. ఇక తన నృత్యం గురించి పై అధికారులు ఏ మాత్రమూ ఆగ్రహించలేదని, ఫలితం బాగున్నప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఎందుకుంటాయని ప్రశ్నించాడు. రంజిత్ సింగ్ డ్యూటీ చేస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News