తమకు వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్న నేపాల్!

  • వ్యాక్సిన్ ను అందించడంలో ముందు నిలిచిన ఇండియా
  • సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ పంపండి
  • నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్
ఇండియాలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన వేళ, తమకు కూడా టీకాను ఇచ్చి ఆదుకోవాలని నేపాల్ విజ్ఞప్తి చేసింది. ప్రపంచానికి వ్యాక్సిన్ ను అందించడంలో ఇండియా ముందు నిలిచిందని వ్యాఖ్యానించిన నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావాలి, ఇండియాను చూస్తుంటే పొరుగునే ఉన్న తమకు కూడా గర్వంగా ఉందని అన్నారు.

సాప్రూ హౌస్ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ కోసం ఇంతకాలమూ నిరీక్షించే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పుడిక ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇండియన్ ఫార్మా కంపెనీలను అభినందించిన ఆయన, పొరుగునే ఉన్న తమకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను ఇవ్వాలని కోరారు.

ఇక నేపాల్ కు వ్యాక్సిన్ పంపడంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోస్ లను నేపాల్ కోరిక మేరకు సాధ్యమైనంత త్వరగానే పంపించే ఏర్పాట్లు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News