నార్వేలో విషాదం... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది వృద్ధులు కన్నుమూత!

  • టీకా ఇవ్వగానే తీవ్ర ప్రభావం
  • విరోచనాలు, జ్వరం, వాంతులతో బాధ
  • ప్రాణాల కోసం పోరాడుతున్న మరో 16 మంది
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నార్వేలో విషాదాన్ని మిగిల్చింది. ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ ను దేశంలో ఇస్తుండగా, టీకాను తీసుకున్న వారిలో 23 మంది వయో వృద్ధులు తీవ్ర అస్వస్థత బారిన పడి కన్నుమూశారు. మరో 16 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే స్వల్ప దుష్పరిణామాలే వృద్ధాప్యం కారణంగా వారిలో పెను ప్రభావాన్ని చూపాయని వైద్య నిపుణులు గుర్తించారు. వీరిలో అత్యధికులు విరోచనాలు, జ్వరం, వాంతులతో బాధపడ్డారని పేర్కొన్నారు.

నార్వేలో జరిగిన ఘటనతో టీకా భద్రతపై అనుమానాలు పెరిగాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు. టీకా తీసుకోగానే చాలా మంది తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని, అలర్జీ లక్షణాలతో పాటు జ్వరం కూడా వచ్చిందని పేర్కొన్న నార్వే ఆరోగ్య శాఖ, కరోనా బారిన పడే అవకాశం అధికంగా ఉన్న 80 ఏళ్లకు పైగా వయసున్న వృద్ధులకు డిసెంబర్ నుంచి ఫైజర్ - బయో ఎన్ టెక్ తయారు చేస్తున్న టీకాను ఇస్తున్నామని పేర్కొంది.

ఇప్పటివరకూ 33 వేల మందికి తొలి డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని, ఈ మరణాల తరువాత టీకాను ఇచ్చే ముందు వైద్యులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించామని పేర్కొంది. ఇక నార్వేలో 80 ఏళ్లు దాటిన వృద్ధుల జీవితకాలం తక్కువగానే ఉంటుంది కాబట్టి, వారికి టీకా ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించినట్టు 'బ్లూమ్ బర్గ్' పేర్కొంది. యువతతో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికే వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేసినట్టు తెలిపింది.

నార్వే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. వృద్ధుల మరణాలపై ఫైజర్ సంస్థ స్పందిస్తూ, ఈ ఘటనపై విచారణకు పూర్తిగా తమవంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.



More Telugu News