రోహిత్ శర్మ ఔటైన తీరుపై గవాస్కర్ విమర్శలు

  • రోహిత్ షాట్ సెలెక్షన్ అసలు బాగోలేదు
  • రాంగ్ షాట్ ఎలా ఆడాడో అర్థం కావడం లేదు
  • అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. వర్షం వల్ల రెండో రోజు ఆట ముగిసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ 7 పరుగులు, రోహిత్ శర్మ 44 పరుగులు చేసి అవుటయ్యారు. మంచి దూకుడు మీద ఆడుతున్న సమయంలో రోహిత్ శర్మ చాలా సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తీరు క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురి చేస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ ఔట్ అయిన తీరుపై విమర్శలు గుప్పించారు. రోహిత్ షాట్ సెలెక్షన్ అసలు బాగోలేదని పెదవి విరిచారు.

లాంగాన్ లో, స్వేర్ లెగ్ లో ఫీల్డర్లు ఉన్నప్పుడు ఆ షాట్ ఆడాలని ఎలా అనుకున్నావని రోహిత్ ను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ ప్రశ్నించారు. అంతకు ముందే లయన్ బౌలింగ్ లో కాన్ఫిడెంట్ గా బౌండరీలు బాదిన రోహిత్... చివరకు రాంగ్ షాట్ ఎలా ఆడాడో అర్థం కావడం లేదని అన్నారు. ఒక సీనియర్ ఆటగాడు అయ్యుండి అనవసరంగా వికెట్ ను సమర్పించుకున్నాడని చెప్పారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కంటే భారత్ 307 పరుగులు వెనుకబడి ఉంది.


More Telugu News