బైడెన్​ టీమ్ లో మరో కశ్మీరీ.. సమీరా ఫాజిలీకి కీలక పదవి

  • జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్ గా నియామకం
  • ప్రస్తుతం బైడెన్–హారిస్ టీంలోనే ఎకనామిక్ ఏజెన్సీ చీఫ్ గా ఫాజిలీ
  • అంతకుముందు అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా విధులు
జో బైడెన్ తన అధికార గణంలో మరో ఇండియన్ కు అవకాశమిచ్చారు. అత్యంత కీలకమైన ఆర్థిక వ్యవహారాల పదవిని అప్పగించారు. కశ్మీర్ కు చెందిన సమీరా ఫాజిలీని జాతీయ ఆర్థిక మండలికి డిప్యూటీ డైరెక్టర్ గా నియమిస్తూ బైడెన్–హారిస్ అధికార మార్పిడి విభాగం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బైడెన్ టీంలో చేరిన రెండో కశ్మీరీ మహిళగా సమీరా నిలిచారు. అంతకుముందు డిసెంబర్ లో కశ్మీర్ కే చెందిన ఆయిషా షాను శ్వేత సౌధం డిజిటల్ స్ట్రాటజీ పార్ట్ నర్ షిప్స్ మేనేజర్ గా నియమించారు. కాగా, ఆర్థిక విధాన తయారీ ప్రక్రియ, విధాన నిర్ణయాలపై అమెరికా అధ్యక్షుడికి ఆర్థిక మండలి సలహాలిస్తుంది.

ప్రస్తుతం బైడెన్–హారిస్ టీంలోనే ఎకనామిక్ ఏజెన్సీ చీఫ్ గా ఫాజిలీ పనిచేస్తున్నారు. అంతకుముందు అట్లాంటాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లో ఎంగేజ్ మెంట్ ఫర్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ విభాగం డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఒబామా–బైడెన్ టీంలోనూ ఫాజిలీ పనిచేశారు. జాతీయ ఆర్థిక మండలి విధాన సలహాదారుగా విధులు నిర్వర్తించారు. అంతేగాకుండా అమెరికా ఖజానా విభాగంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై సీనియర్ సలహాదారుగా ఉన్నారు.

భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె ప్రస్తుతం జార్జియాలో నివాసముంటున్నారు. యేల్ లా స్కూల్ నుంచి న్యాయ విద్యలో, హార్వర్డ్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ లో డిగ్రీ పట్టాలు పొందారు. తర్వాత ప్రభుత్వ అధికారిణిగా చేరడానికి ముందు యేల్ లా స్కూల్ లోనే క్లినికల్ అధ్యాపకురాలిగా పనిచేశారు.


More Telugu News