గుర్రాలను ముస్తాబు చేసి.. ఆయుధాలు చేతబట్టి.. సింఘూలో 15 కిలోమీటర్ల మేర రైతుల సవారీ!

  • గణతంత్ర దినోత్సవాన ట్రాక్టర్ ర్యాలీకి రిహార్సల్స్ అని వెల్లడి
  • సాగు చట్టాలు రద్దు చేయకుంటే ఢిల్లీలోకి చొచ్చుకొస్తామంటున్న రైతులు
  • జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
గుర్రాలను పూలమాలలతో ముస్తాబు చేశారు.. చేతుల్లో ఆయుధాలు పట్టారు.. గుర్రాలెక్కి 15 కిలోమీటర్ల పొడవునా సవారీ చేశారు. ఇదంతా శనివారం రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీలోని సింఘూ సరిహద్దుల్లో జరిగింది. గణతంత్ర దినోత్సవాన రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేయబోతున్న సంగతి తెలిసిందే. దానికి ముందస్తు సన్నాహాల్లో భాగంగా సిక్కు నిహంగ్ కమ్యూనిటీకి చెందిన 50 మంది ఆయుధాలు చేతబట్టి గుర్రాలతో సవారీ చేశారు.

ట్రాక్టర్ ర్యాలీకి సంఘీభావంగా నిహంగ్ లు గుర్రాలతో సవారీ చేస్తారని ఆ వర్గంలోని 19 ఏళ్ల కశ్మీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. తాను కూడా నెల రోజులుగా రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్నానని వెల్లడించాడు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతుల బతుకుదెరువు పోతుందని, అందుకే రైతుల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని చెప్పాడు. తన బాబాయి కూడా రైతేననని, కొత్త చట్టాల వల్ల తాను పండించే కూరగాయలను మంచి ధరకు అమ్ముకోలేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పాడు.

గణతంత్ర దినోత్సవాన చాలా దూరం ట్రాక్టర్ ర్యాలీ ఉంటుందని, అందుకోసమే గుర్రాలతో రీహార్సల్స్ చేశామని సికందర్ అనే మరో రైతు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే.. ఇప్పటిదాకా సరిహద్దుల్లోనే ఉన్న తాము ఢిల్లీలోకీ చొచ్చుకొస్తామని, అక్కడి రోడ్లపై ర్యాలీ తీస్తామని హెచ్చరించాడు.

రైతుల ఆందోళనలకు తానూ నవంబర్ 28న జత కలిశానని చాంద్ కౌర్ అనే 58 ఏళ్ల మహిళా రైతు చెప్పారు. తాము సరిహద్దుల్లో ఉండలేకపోతున్నామన్నారు. చాలా కష్టమవుతోందని, ప్రభుత్వం తమ మాటలు వినే పరిస్థితిలో లేదని అన్నారు. కాబట్టి రాజ్ ఘాట్ లేదా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


More Telugu News