వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు

  • నాలుగో టెస్టుపై వరుణుడి పంజా
  • ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 369 ఆలౌట్
  • భారత్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం
  • మ్యాచ్ నిలిచే సమయానికి టీమిండియా 62/2
  • చిత్తడిగా మారిన మైదానం
బ్రిస్బేన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుపై వరుణుడు పంజా విసిరాడు. రెండో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ సందర్భంగా ప్రారంభమైన వర్షం జోరుగా కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. అప్పటికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 2 వికెట్లకు 62 పరుగులు. మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు గబ్బా స్టేడియం సిబ్బంది ఎంతగా శ్రమించినా ఫలితం లేకపోయింది. దాంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి రెండో రోజు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 274/5తో రెండో రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఆసీస్ 369 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (50) అర్ధసెంచరీ సాధించగా, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 47 పరుగులు చేశాడు. చివర్లో మిచెల్ స్టార్క్ 20 నాటౌట్, నాథన్ లైయన్ 24 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ తలో 3 వికెట్లు తీశారు. సిరాజ్ కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగులు చేసిన యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ స్లిప్స్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ వికెట్ ప్యాట్ కమ్మిన్స్ కు లభించింది. ఇక క్రీజులో కుదురుకుని బ్యాట్ ఝుళిపిస్తున్న సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఫ్ స్పిన్నర్ లైయన్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. దాంతో ఛటేశ్వర్ పుజారా (8), కెప్టెన్ అజింక్యా రహానే (2) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఇన్నింగ్స్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రెండో రోజు ఆటను రద్దు చేశారు. ప్రస్తుతం భారత్... ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 307 పరుగులు వెనుకబడి ఉంది.


More Telugu News