కరోనా మొదటి రోగి ఎవరో కనిపెట్టలేం: డబ్ల్యూహెచ్​ వో

  • ‘పేషెంట్ జీరో’ పదాన్ని జాగ్రత్తగా వాడాలన్న కొవిడ్ టెక్నికల్ లీడ్  
  • సైన్స్, పరిశోధనలను నమ్మాలంటూ విజ్ఞప్తి
  • కరోనా రకాలు కాదు.. కరోనానే డేంజర్ అని హెచ్చరిక
వుహాన్ లో పుట్టి.. యూరప్ కు వెళ్లి.. ప్రపంచమంతా తన చుట్టమేనన్నట్టు చుట్టబెట్టేసింది కరోనా మహమ్మారి. ఏడాది దాటుతున్నా దాని నుంచి ఉపశమనమన్నదే లేదు. ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా.. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలు వెన్నులో వణుకుపుట్టిస్తాయి.

ఈ నేపథ్యంలో.. అసలు కరోనాను అంటించిన తొలి రోగి ఎవరు? ఆమె/అతడికి అదెలా సోకింది? ఎక్కడ అంటింది?.. ఈ ప్రశ్నలు ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడే ఏమిటి.. అసలు భవిష్యత్తులోనూ వాటికి సమాధానం దొరకదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో).

కరోనాకు మూల కారణమైన చైనాలో.. అక్కడ మహమ్మారి పుట్టిన వుహాన్ లో తాము కరోనాపై దర్యాప్తు, పరిశోధనలు చేస్తున్నా ‘పేషెంట్ జీరో (తొలి రోగి)’ని గుర్తించడం సాధ్యం కాకపోవచ్చని డబ్ల్యూహెచ్ వో కొవిడ్ 19 టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవా అన్నారు. పేషెంట్ జీరో అన్న పదాన్ని జాగ్రత్తగా వినియోగించాలని ఆమె సూచించారు. దాని గురించి పట్టించుకోకుండా సైన్స్ ను, కరోనాపై అధ్యయనాలను అనుసరించాలని చెప్పారు.

కొత్త రకం కరోనాతో కేసులు పెరుగుతున్నా.. ఆ కేసుల గొలుసును తెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. కరోనా రూపాలు మార్చుకుంటుందని అందరూ భయపడుతున్నారని, అయితే, అసలు కరోనానే చాలా ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. కాబట్టి కరోనా సోకకుండా ఎవరికి వాళ్లు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలకు సూచించారు.


More Telugu News