కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని మోదీకి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ లేఖ

  • వ్యాక్సిన్ కొనుగోలు చేసే శక్తి పేదలకు లేదు
  • పంజాబ్ పేదలకు వ్యాక్సిన్ ను ఉచితంగా సరఫరా చేయండి
  • రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా గాడిలో పడలేదు
పంజాబ్ కు తొలి విడతలో 2,04,500 కోవిషీల్డ్ వ్యాక్సిన్ లు పంపించినందుకు ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ వేయడంలో వైద్య సిబ్బందికి తొలి ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు. ఈ మేరకు మోదీకి ఆయన లేఖ రాశారు.

పంజాబ్ లోని పేదలకు వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయాలని ఈ సందర్భంగా మోదీని అమరీందర్ కోరారు. దీని వల్ల మహమ్మారి విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. దీని వల్ల ఆర్థికపరమైన అన్ని కార్యక్రమాలు మళ్లీ గాడిలో పడతాయని అన్నారు.పేదల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని... వ్యాక్సిన్ కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత చాలా మందికి లేదని అమరీందర్ సింగ్ చెప్పారు.

కరోనా ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా పడిందని... ఈ మహమ్మారిని నియంత్రించే క్రమంలో రాష్ట్రానికి ఎంతో ఖర్చు అయిందని అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారని... ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక స్థితి గాడిలో పడలేదని చెప్పారు. మరోవైపు, మొహాలీలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమరీందర్ సింగ్ ప్రారంభించారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 59 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


More Telugu News