జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఇంట్లో పోలీసుల తనిఖీలు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్

  • తాడేపల్లిగూడెం పార్టీ ఇన్చార్జి నివాసంలో సోదాలు
  • పోలీసుల చర్యను ఖండించిన నాదెండ్ల మనోహర్
  • తనిఖీలపై పోలీసుల వివరణ ఇవ్వాలని డిమాండ్
  • రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ఆరోపణలు
  • ఫ్యాక్షనిస్టు రాజకీయాలని విమర్శలు
జనసేన పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటిలో భోగి రోజు రాత్రి పోలీసులు తనిఖీలు చేశారని, ఇది అప్రజాస్వామికం అని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పండుగ వేళ ఎలాంటి వారెంట్ లేకుండా బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటిపై తనిఖీలకు వెళ్లడం పట్ల పోలీసులు జవాబు ఇవ్వాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఓ నాయకుడు ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే అధికారపక్షం అప్రజాస్వామిక రీతిలో బెదిరింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ ఫ్యాక్షన్ తరహా రాజకీయం అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ ఘటనపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా చర్చించారని, ఈ అంశంలో బొలిశెట్టి శ్రీనివాస్ కు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.


More Telugu News