తొలిసారి 75 అధునాత‌న‌ డ్రోన్ల‌తో ఆర్మీ విన్యాసం.. వీడియో ఇదిగో

  • ఆర్మీ డేను పురస్కరించుకుని ప్ర‌ద‌ర్శ‌న‌
  • యుద్ధ‌ ట్యాంకులు, క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌లు కూడా ప్ర‌ద‌ర్శ‌న
  • ఆర్మీకి ప్ర‌ముఖుల కృతజ్ఞతలు
ఆర్మీ డేను పురస్కరించుకుని ఈ రోజు ఉద‌యం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఢిల్లీలో నిర్వ‌హించిన ప‌రేడ్‌లో తొలిసారి స్వార్మ్ డ్రోన్స్‌ను ప్ర‌ద‌ర్శించాయి. మొత్తం 75 డ్రోన్ల‌తో ఆర్మీ ఈ విన్యాసాలు ప్ర‌ద‌ర్శించింది. అలాగే, ఆర్మీ యుద్ధ‌ ట్యాంకులు, క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శించారు. 1949లో తొలి భారతీయ జనరల్ గా కె.ఎం.కరియప్ప బ్రిటిష్‌ అధికారి నుంచి భారత సైన్యం బాధ్యతలు స్వీకరించడానికి గుర్తుగా ఏటా జనవరి 15న ఆర్మీ డేను జరుపుకొంటున్నాం.  

ఈ సంద‌ర్భంగా చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ తో పాటు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఆర్మీ డే సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు సైనికుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. భారతావని ఆర్మీకి కృతజ్ఞతలు చెబుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అన్నారు.

శౌర్యానికి, దేశభక్తికి మన జవాన్లు ప్రతీకలని, వారి త్యాగాలు వెలకట్టలేనివ‌ని  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. దేశ ప్రజలందరి తరఫున భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నాన‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భార‌త‌ స‌రిహ‌ద్దు దేశాల‌తో ఉన్న స‌మ‌స్య‌లను చ‌‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఆర్మీ చీఫ్ న‌ర‌వణె తెలిపారు. అయితే, భార‌త‌  స‌హ‌నాన్ని ప‌రీక్షించే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్దని హెచ్చ‌రించారు.


More Telugu News