దుర్గ గుడిలో గోపూజ నిర్వహించాం.. 18 నుంచి చతుర్వేద హోమాన్ని నిర్వహించనున్నాం: ఈవో సురేశ్ బాబు

  • దేవాదాయ శాఖ ఆదేశాలతో గోపూజను నిర్వహించాం
  • ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించాం
  • పనులు పూర్తయ్యాక సీఎంతో ప్రారంభిస్తాం
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాదాయశాఖ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించామని ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపారు. ప్రతిరోజు గోపూజ జరుగుతుందని, భక్తులు పాల్గొనవచ్చని చెప్పారు.

ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతో ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభించామని తెలిపారు. శివాలయ పునర్నిర్మాణం, ప్రాకారం, అన్నదాన భవనం, ప్రసాదం పోటులను నిర్మిస్తామని తెలిపారు. ఏడాది కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేస్తామని... ముఖ్యమంత్రి జగన్ తో వీటిని ప్రారంభిస్తామని చెప్పారు.

ఈనెల 18 నుంచి 25 వరకు ఆలయంలో చతుర్వేద హోమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ హోమానికి కేవలం వేద పండితులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని... సాధారణ భక్తులకు వీక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ హోమంలో పాల్గొనేందుకు పలువురు పీఠాధిపతులు వస్తున్నారని చెప్పారు. మరోవైపు దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు మాట్లాడుతూ, గోవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. గోవులను రక్షించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం గోపూజను నిర్వహిస్తోందని చెప్పారు.


More Telugu News