రూ.20 వాట‌ర్ బాటిల్‌కు రూ.164 బిల్లు వేసిన రెస్టారెంటు.. కేసు వేసి గెలిచిన వ్య‌క్తి

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్ వాసి న్యాయ పోరాటం
  • ఐదేళ్ల త‌ర్వాత కేసు గెలిచిన వ్య‌క్తి
  • రూ.5,500 పరిహారంగా బాధితుడికి చెల్లించాల‌న్న కోర్టు
రెస్టారెంట్ల‌లో వాటర్ బాటిల్ వంటివాటికి ఎమ్మార్పీ కంటే అధిక బిల్లులు వ‌సూలు చేస్తున్న‌ప్ప‌టికీ ఎవ్వ‌రూ పట్టించుకోరు. వారు వేసినంత బిల్లు క‌ట్టి వెళ్లిపోతుంటారు.  అయితే, ఓ వ్య‌క్తి మాత్రం ఓ రెస్టారెంటు అధిక బిల్లు వ‌సూలు చేసినందుకు గాను కేసు వేసి, సుదీర్ఘ కాలం పాటు పోరాడి గెలిచాడు.

రెస్టారెంటులో ఎమ్మార్పీ రేటు ప్ర‌కారం కాకుండా అధిక ధ‌ర‌కు వాట‌ర్ బాటిల్ ను అమ్మ‌డంతో ఓ వ్య‌క్తి కేసు వేసి ఐదేళ్ల త‌ర్వాత గెలిచాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రోహిత్‌ పాటిల్ (67) 2015, అక్టోబరులో ఎస్‌జీ హైవేలోని ఓ హోటల్‌కు వెళ్లి త‌న స్నేహితుల‌తో క‌లిసి భోజ‌నం చేశాడు. అలాగే, ఓ వాటర్‌ బాటిల్ తీసుకున్నాడు.

అయితే, రూ.20 వాట‌ర్ బాటిల్ కి బిల్లులో రూ.164గా వేయ‌డంతో షాక‌య్యాడు. దీనిపై రెస్టారెంటు సిబ్బందిని ప్ర‌శ్నించాడు. తాము రెస్టారెంటులో వాటర్‌ బాటిల్ ను ఆ ధరకే అమ్ముతామ‌ని సిబ్బంది స్ప‌ష్టం చేశారు. రోహిత్ తో హోట‌ల్ సిబ్బంది‌ బిల్లు మొత్తాన్ని క‌ట్టించే దాకా వ‌ద‌ల‌లేదు.

దీంతో బిల్లు క‌ట్టిన రోహిత్ హోటల్‌ నుంచి వెంట తెచ్చుకున్న వాటర్‌ బాటిల్ తో పాటు  దాని బిల్లు ఆధారంగా 2015, నవంబర్ లో వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయడంతో దీనిపై విచార‌ణ కొన‌సాగింది. రెస్టారెంటు యాజమాన్యానికి నోటీసులు వెళ్ల‌డంతో వారు న్యాయవాదిని నియ‌మించుకుని వాదనలు వినిపించారు.

వాటర్‌ బాటిల్‌కు రూ.164 బిల్లు వేయడం స‌రైందేన‌ని, త‌మ‌ హోటల్‌లో స‌ర్వీసుకు తగ్గట్టుగానే ధర ఉందని వాదించారు. ఇరు ప‌క్షాల‌ వాదనలను విన్న కోర్టు తాజాగా తుది తీర్పు వెల్ల‌డిస్తూ, వాటర్‌ బాటిల్‌కు అంత ధర వసూలు చేయడం అన్యాయమని స్ప‌ష్టం చేసింది.

వాట‌ర్ బాటిల్ ఎంఆర్‌పీ ధర కంటే భారీ మొత్తంలో బిల్లు వ‌సూలు చేశార‌ని చెప్పింది. అలాగే, రోహిత్ ను హోటల్ సిబ్బంది వేధింపులకు గురిచేసినందుకు రూ.2,500తో పాటు ఇతర ఖర్చులు రూ.3,000 క‌లిపి రూ.5,500 పరిహారంగా బాధితుడు రోహిత్‌కు నెల‌రోజుల్లో ఇవ్వాలని కోర్టు చెప్పింది. కోర్టు త‌న‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డంతో రోహిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. త‌న‌కు వ‌చ్చే పరిహారం మొత్తాన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థకు ఇస్తాన‌ని చెప్పాడు.


More Telugu News