టీకాను ఉచితంగా ఇవ్వడంలో కేంద్రం విఫలమైతే.. ఆ పని మేమే చేస్తాం: కేజ్రీవాల్ హామీ

  • కరోనాతో మరణించిన వైద్యుడి కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్
  • కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేత
  • వైద్యుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ
  • వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచన
కరోనా టీకాను ఉచితంగా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం కనుక విఫలమైతే, తామే దానిని ఉచితంగా ప్రజలకు అందిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. విధుల్లో ఉండగా కరోనాతో మృతి చెందిన వైద్యుడు హితేశ్ గుప్తా కుటుంబాన్ని కేజ్రీవాల్ నిన్న పరామర్శించి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హితేశ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో కరోనా టీకా డోసుల ఖర్చును భరించలేని వారు ఎందరో ఉన్నారని, వారి విషయంలో కేంద్రం ఏం చేస్తుందో వేచి చూద్దామని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక వారందరికీ టీకాను ఉచితంగా ఇవ్వడంలో విఫలమైతే ఆ పనిని తామే చేస్తామని హామీ ఇచ్చారు.

మన టీకా విషయంలో ఎలాంటి అపోహలు వద్దని, టీకాపై అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కలిసి పూర్తి సురక్షితమైన వ్యాక్సిన్‌ను రూపొందించారని కొనియాడారు. వ్యాక్సినేషన్‌కు అందరూ ముందుకు రావాలని సీఎం కోరారు. కాగా, శనివారం ఢిల్లీలో 89 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.


More Telugu News