జేఈఈ విద్యార్థుల కోసం ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించిన అమెజాన్.. ఇప్పటికైతే ఫ్రీ!

  • 'అమెజాన్ అకాడమీ' పేరుతో ఆన్ లైన్ అకాడమీ ఏర్పాటు
  • లైవ్ లెక్చర్స్ తో పాటు అందుబాటులో స్టడీ మెటీరియల్
  • కొన్ని నెలల పాటు ఫ్రీగా సేవలందిస్తామన్న అమెజాన్
ప్రపంచ ప్రఖ్యాత ఈకామర్స్ దిగ్గజం భారత్ లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. జేఈఈ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించింది. 'అమెజాన్ అకాడమీ' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. వెబ్ సైట్ ద్వారానే కాకుండా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఆన్ లైన్ అకాడమీలో లైవ్ లెక్చర్స్ తో పాటు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఉంటుంది. అంతేకాదు విద్యార్థులు తమను తాము సమీక్షించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్లాట్ ఫామ్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉందని... మరికొన్ని నెలల పాటు ఉచితంగానే ఉంటుందని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో అమెజాన్ ఇండియా తెలిపింది.

ఇండియాలో ఐఐటీ, ఎన్ఐటీ వంటి టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు సంపాదించాలంటే జేఈఈ పరీక్ష తప్పనిసరి. లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2020లో బైజూస్, అనకాడమీ, వేదాంతు వంటి కంపెనీలు దాదాపు 2.22 బిలియన్ డాలర్ల బిజినెస్ చేశాయి. ఆన్ లైన్ అకాడమీలకు డిమాండ్ పెరుగుతుండటంతో అమెజాన్ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టింది.


More Telugu News