ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ 25 నాటికి సిద్ధంగా ఉండాలి: సబితా ఇంద్రారెడ్డి

  • ఫిబ్రవరి 1న తెరుచుకోనున్న విద్యాసంస్థలు
  • ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సబిత
  • అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశం
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి నుంచి ఆపై తరగతులకు విద్యాలయాలను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సబిత ఆదేశించారు. విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని అన్నారు. 9, 10 , ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, ఈ నెల 20లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

జిల్లా, మండల స్థాయి విద్యాధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించాలని, అవసరమైన చర్యలను చేపట్టాలని సబిత ఆదేశించారు. విద్యాసంస్థల్లో భోజన సదుపాయాల ఏర్పాటు కోసం బియ్యం, పప్పు, ఇతర అవసరమైన సామగ్రిని జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రైవేట్ విద్యా సంస్థలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ నెల 19న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు.


More Telugu News