నేటి నుంచే థాయిలాండ్ ఓపెన్.. భారత షట్లర్ సైనాకు కరోనా నిర్ధార‌ణ‌

  • పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని చెప్పిన  బీడబ్ల్యూఎఫ్‌
  • ప్ర‌ణ‌య్ కు కూడా క‌రోనా నిర్ధార‌ణ‌
  • థాయిలాండ్ ఓపెన్ లో త‌ల‌ప‌డ‌నున్న పీవీ సింధు
భారత  షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా సోకింది. దీంతో థాయిలాండ్ ఓపెన్ నుంచి ఆమె వైదొలగనుంది. థాయ్‌లాండ్ ఓపెన్‌ సూపర్‌-1000 నేటి నుంచే ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో సైనాకు కరోనా పాజిటివ్ రావ‌డం గ‌మ‌నార్హం.

పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు క‌రోనా పరీక్షలను నిర్వహించగా ఆమెకు క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. ఈ పోటీల్లో ఆమె తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన షట్లర్‌ కిసోనా సెల్వడురేతో ఆడాల్సి ఉంది.  టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని సైనాను బీడబ్ల్యూఎఫ్‌ కోరింది.

అంతేకాదు, ఆమెతో పాటు భారత షట్లర్‌ ప్రణయ్ కి కూడా క‌రోనా నిర్ధార‌ణ అయింది. బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు కూడా ఆట‌గాళ్లు, అంపైర్లు అంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకున్నారు. బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడా మళ్లీ కరోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.  

కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం కుదేలైన నేప‌థ్యంలో దాదాపు 10 నెలల తర్వాత సైనాతో పాటు పీవీ సింధు మ‌ళ్లీ పోటీల్లో పాల్గొంటున్నారు.  థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో సైనా, ప్ర‌ణ‌య్ మిన‌హా మిగ‌తా భార‌త క్రీడాకారులంతా పాల్గొననున్నారు.

ఈ పోటీకి జపాన్, చైనా ప్లేయర్లు హాజ‌రుకాలేదు. దీంతో భారత ష‌ట‌ర్లు టైటిల్‌ గెలిచేందుకు అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. పీవీ సింధు తొలిరౌండ్లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో ఆడ‌నుంది.


More Telugu News