అన్నను చంపినవాడి కోసం చెల్లి ప్రేమ వల... చివరి నిమిషంలో వికటించిన ప్లాన్!

  • ముంబైలో గత సంవత్సరం జూన్ లో హత్య
  • హంతకుడిని ప్రేమలోకి దించిన మృతుడి సోదరి
  • స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్
  • స్థానికుల సమాచారంతో రక్షించిన పోలీసులు
తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన ఓ యువతి, నిందితుడిపై ప్రేమ వల విసిరి, ఒంటరిగా రప్పించింది. అంతవరకూ బాగానే ఉందికానీ, చివరి క్షణాల్లో ఆమె ప్లాన్ విఫలమై, ఆమెతో పాటు ఆమెకు సహకరించిన వారందరూ ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లారు.

ఓ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీకి ఏ మాత్రమూ తగ్గని ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, ముంబైలో అల్తాఫ్, యాస్మిన్ అన్నా చెల్లెళ్లు. గత సంవత్సరం జూన్ లో మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరుగగా, అల్తాఫ్ ను హత్య చేసిన మహ్మద్ సాధిక్, ఆపై ఢిల్లీకి పారిపోయాడు. సోదరుడి హత్యను తట్టుకోలేకపోయిన యాస్మిన్, ఎలాగైనా సాధిక్ ను చంపాలని నిర్ణయించుకుంది. అందుకోసం సోదరుడి స్నేహితులైన ఫరూక్, ఒవైసీ, మనీస్, జాకీర్ ఖాన్, సత్యం పాండేల సాయాన్ని కోరింది.

వారు కూడా అంగీకరించడంతో తన ప్లాన్ ను అమలు చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఓ నకిలీ ఖాతాను తెరిచిన యాస్మిన్, దాని ద్వారా సాధిక్ తో చాటింగ్ మొదలు పెట్టింది. ఆమె వలపు వలలో పడిన సాధిక్, ఆమెను కలిసేందుకు ముంబైకి రాగా, ఆరేలోని చోటాక్మీర్ ప్రాంతానికి రప్పించింది. అదే సమయంలో అతన్ని మట్టుబెట్టే ఆలోచనలో ఉన్న అల్తాఫ్ స్నేహితులు ఓ అంబులెన్స్ ను తీసుకుని వచ్చారు.

ఆ ప్రాంతానికి సాధిక్ రాగానే, బలవంతంగా అంబులెన్స్ ఎక్కించారు. సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అతన్ని చంపాలన్నది వారి ప్లాన్. అయితే, సాధిక్ ను బలవంతంగా ఎక్కిస్తుంటే చూసిన ఓ స్థానికుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అంబులెన్స్ కోసం గాలింపు ప్రారంభించారు. ఈలోగా, అంబులెన్స్ ను వదిలేసి, మరో కారులో నిందితులు వెళుతుండగా, వెస్ట్రన్ హైవేపై అప్పటికే సోదాలు ప్రారంభించిన పోలీసులు కారును గుర్తించారు.

ఈ కేసులో యాస్మిన్ సహా నిందితులను అరెస్ట్ చేసి సాధిక్ ను రక్షించామని పేర్కొన్న పోలీసు అధికారులు, అల్తాఫ్ ను చంపేసిన కేసులో పరారీలో ఉన్న సాధిక్ ను కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు.


More Telugu News