ముందు వరుస యోధులకే తొలివిడత వ్యాక్సిన్... ఖర్చంతా మాదే: ప్రధాని మోదీ

  • సీఎంలతో ఇవాళ మోదీ సమీక్ష
  • ఈ నెల 16 నుంచి వాక్సినేషన్ అని వెల్లడి
  • రాష్ట్రాలకు ఖర్చుతో సంబంధం లేదని స్పష్టీకరణ
  • వైద్య, పారిశుద్ధ్య, రక్షణ బలగాలు, పోలీసులకు వ్యాక్సిన్ ఇస్తామని వివరణ
మరికొన్నిరోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. జనవరి 16 నుంచి మొదలయ్యే కరోనా మొదటి వ్యాక్సినేషన్ లో ముందు వరుస యోధులకే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అందుకు అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని వివరించారు.

తొలి విడతలతో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, త్రివిధ దళాలు, పోలీసులు, పారామిలిటరీ దళాలకు మొదటి విడతలో వ్యాక్సిన్ అందజేస్తారని మోదీ స్పష్టం చేశారు. రెండో విడతలో 50 ఏళ్ల పైబడినవారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వాళ్లకు వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు.

 కాగా, ప్రజాప్రతినిధులకు కూడా తొలివిడతలోనే వ్యాక్సిన్ ఇవ్వాలన్న విజ్ఞప్తులపైనా మోదీ స్పందించినట్టు తెలిసింది. రాజకీయనేతలు వ్యాక్సిన్ కోసం మరికొంతకాలం ఆగాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం.


More Telugu News