సహనం గురించి మాకు బోధించే ప్రయత్నం చేయొద్దు: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

  • వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న సుప్రీం
  • ఇందులో ప్రిస్టేజ్ ఇష్యూ ఏముందని ప్రశ్న
  • పరిస్థితి ఇలాగే కొనసాగితే శాంతికి విఘాతం కలగవచ్చని వ్యాఖ్య
కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోతే... తామే ఆ పని చేస్తామని హెచ్చరించింది. విచారణ సందర్భంగా సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. సహనం గురించి తమకు బోధించే ప్రయత్నం చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని చెప్పారు. మీరు సమస్యలో భాగం కావాలనుకుంటున్నారా? లేక పరిష్కారంలో భాగం కావాలనుకుంటున్నారా? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

'వ్యవసాయం, ఆర్థికశాస్త్రాల్లో మేము నిష్ణాతులం కాదు. ఈ చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా? లేక మమ్మల్ని చేయమంటారా? ఇందులో ప్రిస్టేజ్ ఇష్యూ ఏముంది? మీరు సమస్యలో భాగస్వామా? లేక పరిష్కారంలోనా? అనే విషయం మాకు అర్థం కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు శాంతికి విఘాతం కలగవచ్చు. ఊహించని పరిణామాలు సంభవిస్తే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? మా చేతులకు గాయాలు అవ్వాలని కానీ, రక్తం అంటుకోవాలని కాని మేము భావించడం లేదు.

ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో చాలా అసంతృప్తికి గురయ్యాం. సరైన రీతిలో సమస్యను మీరు డీల్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఓ కమిటీని వేద్దాం. ఈ చట్టాలు బాగున్నాయని ఎక్కువ మంది భావిస్తున్నట్టయితే... అదే విషయాన్ని కమిటీకి వారిని చెప్పమనండి. గత ప్రభుత్వాలను విమర్శించే ప్రయత్నం చేయొద్దు. 

నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుంది. గాంధీ సత్యాగ్రహం మాదిరి నిరసన హక్కును ఉపయోగించుకోవచ్చు. రైతులు వారి నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా చేయాలి' అని సుప్రీం తెలిపింది. నిరసనల్లో పాల్గొంటున్న మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇళ్లకు వెళ్లిపోవాలని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కోరారు.


More Telugu News