మరో యాగానికి సిద్ధమవుతున్న కేసీఆర్?

  • త్వరలోనే యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం
  • సుదర్శనయాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేయనున్న కేసీఆర్
  • రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను ఆహ్వానించే యోచనలో సీఎం
ఇప్పటికే ఎన్నో యాగాలు చేసిన ఘనతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించారు. ఎక్కడో పురాణాల్లో చదివే చండీయాగం, రాజశ్యామలయాగం వంటి వాటిని నిర్వహించి యావత్ దేశ దృష్టిని ఆయన ఆకర్షించారు. తాజాగా మరో యాగానికి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కలలుగన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఆలయ ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేయనున్నారు.

ఈ ఆలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగంతో పాటు చండీయాగం, రాజశ్యామలయాగం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ క్రతువు ముగిసిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కి సీఎంగా పట్టాభిషేకం చేసి, ఆ బాధ్యతల నుంచి కేసీఆర్ వైదొలగుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే కేటీఆర్ కు సీఎం బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, సెంటిమెంట్లకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత నిస్తారు. దీంతో, సంక్రాంతి ముందు కేటీఆర్ ను సీఎం చేయడం ఎందుకని కేసీఆర్ భావించినట్టు చెపుతున్నారు. ఈ కారణంగానే కేటీఆర్ సీఎం అయ్యే కార్యక్రమం వాయిదా పడిందని అంటున్నారు.


More Telugu News