బెంగాల్‌లో 200కుపైగా స్థానాల్లో విజయం సాధిస్తాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్

  • ఉత్తర బెంగాల్‌ను సందర్శించిన మంత్రి
  • తేయాకు కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని వ్యాఖ్య
  • డార్జిలింగ్ ప్రజల కళలు, సంస్కృతిని మమత విస్మరించారని మండిపాటు
పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్ర ప్రజలు కోపంగా ఉన్నారని, మార్పు కోసం వారు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉత్తర బెంగాల్‌ను సందర్శించిన ఆయన అక్కడ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

డార్జిలింగ్‌కు ప్రకృతి ఎన్నో ఇచ్చిందని, అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ప్రాంతానికి శాపంగా మారిందన్నారు. ఇక్కడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల జీవితాలు బాగుపడలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మంత్రి విమర్శించారు. డార్జిలింగ్ ప్రజల కళలు, సంస్కృతిని ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డార్జిలింగ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సరైన వేదిక కూడా లేదని, రాష్ట్ర ప్రభుత్వం కనుక భూమిని ఇస్తే తామిక్కడ బ్రహ్మాండమైన వేదిక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నిర్ణీత కాల వ్యవధిలో గూర్ఖా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి పేర్కొన్నారు.


More Telugu News