తమిళనాడులో విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటా ఫ్రీ

  • కరోనా ప్రభావంతో ఆన్ లైన్ క్లాసులు
  • కాలేజీ విద్యార్థులకు ఫ్రీ డేటా ఇస్తున్న తమిళనాడు ప్రభుత్వం
  • 9 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
  • జనవరి నుంచి ఏప్రిల్ వరకు సదుపాయం
కరోనా వ్యాప్తి ప్రభావంతో ప్రపంచమంతా మారిపోయింది. విద్యావ్యవస్థ ఆన్ లైన్ బాట పట్టింది. ఆన్ లైన్ అన్న తర్వాత ఇంటర్నెట్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్టు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఇవాళ ప్రకటించారు. ఈ ఉచిత పథకంతో  9 లక్షల మందికి పైగా కాలేజీ విద్యార్థులు లబ్ది పొందుతారని తెలుస్తోంది.

జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం వర్తించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతూ ఉపకారవేతనాలు పొందుతున్న విద్యార్థులు ఈ ఉచిత డేటా పొందవచ్చని సీఎం పళనిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

ఉచిత డేటాకు సంబంధించిన రీచార్జి కార్డులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ (ఈఎల్ సీఓటీ) ద్వారా పంపిణీ చేస్తామని వివరించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంతేగాకుండా, ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లు కూడా అందిస్తోందని తెలిపారు.


More Telugu News