అడవిలో ఎక్కడ చూసినా కోడిపిల్లలే... పోటీలు పడి ఎత్తుకెళ్లిన గ్రామస్తులు!

  • కర్ణాటక చిక్కబళ్లపుర ప్రాంతంలో ఘటన
  • కోడిపిల్లలు పెంచేందుకు రైతులతో కంపెనీల ఒప్పందం
  • దాణా రేట్లు పెరిగాయంటూ అధికమొత్తంలో చెల్లించాలన్న రైతులు
  • పాత రేట్లే చెల్లిస్తామన్న కంపెనీలు
  • కోడిపిల్లలను అడవిలో వదిలేసిన రైతులు
కర్ణాటకలోని చిక్కబళ్లపుర ప్రాంతంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇక్కడి అటవీప్రాంతంలో వేల సంఖ్యలో కోడిపిల్లలు కనిపించడంతో పలు గ్రామాల ప్రజలు దొరికినవాళ్లకు దొరికినన్ని ఎత్తుకెళ్లారు. అసలు, అటవీప్రాంతంలోకి అన్ని కోడిపిల్లలు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా ఆసక్తికర అంశం వెల్లడైంది.

చిక్కబళ్లపుర ప్రాంతంలో కోళ్ల ఫారాలు అధికంగా ఉంటాయి. అనేక చికెన్ కంపెనీలు అక్కడి రైతులకు కోడిపిల్లలను సరఫరా చేసి వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఆ కోళ్లను రైతులే పెంచి మళ్లీ ఆ చికెన్ కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది. అందుకు గాను రైతులకు ఆ కంపెనీలు కొంత మొత్తం చెల్లిస్తుంటాయి. అయితే కరోనా ప్రభావంతో దాణా రేట్లు పెరగడంతో తమకు అధిక మొత్తంలో చెల్లింపులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కిలోకు రూ.12 వరకు పెంచాలని రైతులు కోరుతుండగా, పాత రేట్లే చెల్లిస్తామని కంపెనీలు తెగేసి చెప్పాయి. దాంతో ఆ కంపెనీలు ఇచ్చిన కోడిపిల్లలను రైతులు సమీపంలో ఉన్న అడవిలో వదిలేశారు.

ఆ విధంగా ఉదయాన్నే కోడిపిల్లల అరుపులతో నిద్రలేచిన సమీప గ్రామాల ప్రజలు చిక్కబళ్లాపుర అటవీప్రాంతానికి తరలివచ్చారు. కణిదనహళ్లి, రంగస్థల, బొడిగనహళ్లి తదితర గ్రామాల వద్ద ఈ కోడిపిల్లలు వేల సంఖ్యలో కనిపించాయి. ప్రజలు వాటిని సంచుల్లోనూ, పెట్టెల్లోనూ పట్టుకెళ్లారు.

ఒక్కసారే ఇంత పెద్ద సంఖ్యలో కోడిపిల్లలు దర్శనమివ్వడంతో బర్డ్ ఫ్లూ అనుమానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో, పౌల్ట్రీ రైతులకు, కంపెనీలకు మధ్య తేడాలు రావడం వల్లే కోడిపిల్లలు అడవుల పాలయ్యాయని తెలిసింది.


More Telugu News