అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా వర్గీయుల మధ్య ఘర్షణ.. హనుమాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత

  • ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఘటన
  • ఎమ్మెల్యే వాహనానికి అడ్డొచ్చిన రాధా వాహనం
  • తప్పుకోవాలంటూ సైరన్ మోగించడంతో ఆగ్రహం
  • వాహనాలను నిలిపివేసి ఘర్షణకు దిగిన అనుచరులు
దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, టీడీపీ నేత వంగవీటి రాధా వర్గీయుల మధ్య ఘర్షణతో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం..  అబ్బయ్య చౌదరి, రాధా తమ అనుచరులతో కలిసి వేర్వేరు వాహనాల్లో ఏలూరు వైపు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ జంక్షన్ వద్ద రాధా అనుచరులు ప్రయాణిస్తున్న వాహనం ఎమ్మెల్యే వాహనానికి అడ్డం వచ్చింది. దీంతో తప్పుకోవాలంటూ ఎమ్మెల్యే వాహనం సైరన్ మోగిస్తూ సంకేతాలిచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాధా వర్గీయులు దూకుడు మరింత పెంచారు.

కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినప్పటికీ పట్టించుకోకపోగా, ఎమ్మెల్యే ఉంటే ఏంటంటూ ప్రశ్నించడంతో వివాదం చెలరేగింది. దీంతో మూలకొట్టు కూడలి వద్ద వాహనాలు నిలిపివేయడంతో ఇరువురి నాయకుల అనుచరులు కిందికి దిగి ఘర్షణ పడ్డారు. విషయం తెలిసి జనం భారీగా పోగవడంతో ట్రాఫిక్ స్తంభించింది.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం ముగిసింది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, రాధా మాట్లాడుకుని జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడుకుని అక్కడి నుంచి ఎవరికి వారు వెళ్లిపోయారు.


More Telugu News