బెంగాల్ శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి.. గవర్నర్ జగదీప్ ధన్‌కర్ సంచలన వ్యాఖ్యలు

  • అమిత్ షాతో భేటీ అయిన గవర్నర్ ధన్‌కర్
  • రాష్ట్రంలో అల్‌ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయన్న గవర్నర్
  • ఇతర రాష్ట్రాల నుంచి వస్తే ఔట్ సైడర్స్ అని పిలుస్తున్నారు
  • రానున్న ఎన్నికలు సంస్కృతిని కాపాడుకునేందుకు మంచి అవకాశం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని, ఫలితంగా రాష్ట్ర భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నిన్న సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో అల్‌ఖైదా నెట్‌వర్క్ విస్తరిస్తోందని, బాంబుల అక్రమ తయారీ జోరుగా సాగుతోందన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో కార్యనిర్వాహకశాఖ ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తుండడంతో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ సంస్కృతిని కాపాడుకునేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా బెంగాల్ వస్తే వారిని ఔట్ సైడర్స్ అని పిలుస్తుండడం తనను ఎంతో ఆవేదనకు గురిచేస్తోందన్నారు. 2018లో పంచాయతీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, రానున్న ఎన్నికల్లో ఇలాంటి వాటికి చోటు లేకుండా పనిచేయాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News