కేసీఆర్ వల్లే తెలంగాణలో బీజేపీ బలపడింది: వీహెచ్

  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు
  • లేకపోతే బీజేపీని కాంగ్రెస్ అడ్డుకునేది
  • సోనియాగాంధీని కూడా కేసీఆర్ మోసం చేశారు
తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా బలపడిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలలో సీట్లు సాధించిన తర్వాత బీజేపీ నేతల వాయిస్ పెరిగింది. ఇటీవల జరిగిన దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో అధికార పక్షానికి షాక్ ఇవ్వడంతో వారి ఆత్మ స్థైర్యం బలపడింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే పోటీ అని... వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి కేసీఆరే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోకపోతే తమ పార్టీ ఇప్పటికీ బలంగా ఉండేదని... బీజేపీ ఎదగకుండా అడ్డుకునేదని చెప్పారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పి సోనియాగాంధీని కూడా కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీ కూడా ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటోందని అన్నారు. బీజేపీలో చేరితే పాపం పరిహారమవుతుందని ఆ పార్టీ నేతలు చెప్పడం దారుణమని మండిపడ్డారు.


More Telugu News