ఏపీలో సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలంటూ ఎస్ఈసీ ఆదేశం!

  • ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది
  • అమల్లో ఉన్న పథకాలన్నీ ఆపేయండి
  • బడ్జెట్ కేటాయించినా ఓటర్లను ప్రభావితం చేసినట్టే
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్... ఒక్క రోజు కూడా గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపేయాలని ఆయన ఆదేశించారు. అమల్లో ఉన్న పథకాలను కూడా ఆపేయాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినా ఓటర్లను ప్రభావితం చేసినట్టే అవుతుందని స్పష్టం చేశారు.

మరోవైపు సోమవారంనాడు జగన్ చేతుల మీదుగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాలు ప్రభుత్వానికి శరాఘాతంగా తగిలాయి. అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంగా మారనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి కాబట్టి... తక్షణమే ఆపేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఈ ఎన్నికలను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. సోమవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారిస్తుంది. జరుగుతున్న ఈ పరిణామాలతో ఏపీలో రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణలో సైతం ఈ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


More Telugu News