అమాయకులను కేసుల్లో ఇరికించి హింసించకండి.. ఇది క్షమించరాని మహాపాపం: చంద్రబాబు

  • ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
  • ఏటిగైరంపేట ఘటనలో అమాయకుల్ని వేధిస్తున్నారని ఆరోపణ
  • వృద్ధులను కూడా స్టేషన్లో పెట్టారని వెల్లడి
  • వీళ్లసలు మనుషులేనా అంటూ ఆగ్రహం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గొలుగొండ మండలం ఏటిగైరంపేట రామాలయం ఘటనలో గుడి ఎదురుగా కిరాణా దుకాణం నడుపుకుంటూ భక్తితో ఆలయ నిర్వహణ చూస్తున్న 69 ఏళ్ల పోలిశెట్టి కనకరాజు, పోలిశెట్టి సంతోష్ అనే ఆర్యవైశ్యులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి హింసించడం దారుణమని తెలిపారు. ఆఖరికి ఆలయ పూజారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం హేయమైన చర్య అని విమర్శించారు.

వైసీపీ పాలనలో సుమారు 140 ఆలయాలపై ఇన్ని నెలలుగా దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం చేతకాని వాళ్లు ఇప్పుడు వారాంతపు సెలవులు అని తెలిసినా అమాయకులను, వృద్ధులను స్టేషన్ లో పెట్టి వేధిస్తున్నారంటే వీళ్లు అసలు మనుషులేనా? అని మండిపడ్డారు. పైగా వాళ్ల మీద టీడీపీ కార్యకర్తలు అనే ముద్ర వేసి విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఘటనతో సంబంధం ఉందని చెబుతున్న మరో వ్యక్తి వైసీపీ నేతలతో ఉన్న ఫొటోలు బయటపడ్డాయని చంద్రబాబు వెల్లడించారు. అలాంటప్పుడు అతనితో వైసీపీ నేతలే కావాలని ఇదంతా చేస్తున్నారని మేం కూడా అనాలా?  అని నిలదీశారు.

"చేతనైతే ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ఆపండి... అంతేకానీ, ఇలా అమాయకులను కేసుల్లో ఇరికించి హింసించకండి... ఇది క్షమించరాని మహాపాపం" అని హితవు పలికారు.


More Telugu News