సిడ్నీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట... పటిష్ట స్థితిలో ఆసీస్

  • రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 103/2
  • ఓవరాల్ ఆధిక్యం 197 పరుగులు
  • తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులకు ఆలౌటైన భారత్
  • కమ్మిన్స్ కు 4 వికెట్లు
సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. తద్వారా తన ఆధిక్యాన్ని 197 పరుగులకు పెంచుకుంది. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలున్న నేపథ్యంలో రేపటి ఆటలో ఆసీస్ మరో 150 పైచిలుకు పరుగులు జోడించినా చాలు... టీమిండియాకు కష్టాలు తప్పవనిపిస్తోంది.

అంతకుముందు, భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 96/2తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. పుజారా 50 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 22 పరుగులు నమోదు చేశాడు. వికెట్ కీపర్ పంత్ (36), జడేజా (28) పట్టుదలగా ఆడినా భారీ స్కోర్లు సాధించలేకపోయారు. టీమిండియా ఇన్నింగ్స్ లో ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరగడం వికెట్ల మధ్య పరుగు తీయడంలో సమన్వయ లోపాన్ని వెల్లడి చేసింది. కంగారూ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 4, హేజెల్ వుడ్ 2 వికెట్లు తీశారు.

ఆపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్ మన్ విల్ పుకోవ్ స్కీ(10)ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అయితే, ఫామ్ లో ఉన్న మార్నస్ లబుషానే, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ ఎంతో నిబ్బరంగా ఆడి మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. మూడో రోజు ఆట చివరికి  లబుషానే 47, స్మిత్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్ లో పంత్, జడేజా గాయపడడం భారత శిబిరాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లు పలువురు గాయాలతో ఏకంగా సిరీస్ కే దూరం కాగా, సిరీస్ కీలక దశలో ఉన్న సమయంలో ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు గాయపడడం టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపనుంది.


More Telugu News