చాలా మంచిది: ట్రంప్ వ్యాఖ్యలపై బైడెన్ స్పందన

  • బైడెన్ ప్రమాణస్వీకారానికి వెళ్లనని చెప్పిన ట్రంప్
  • ట్రంప్ రాకపోవడం సంతోషకరమన్న బైడెన్
  • అమెరికాకే ఇబ్బందికరమైన వ్యక్తిగా ట్రంప్ పరిణమించారన్న బైడెన్
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన గెలుపును అడుగడుగునా వ్యతిరేకించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరు కాబోనని ఆయన ప్రకటించారు.

ఈ వ్యాఖ్యలపై బైడెన్ స్పందిస్తూ, 'చాలా మంచిది' అని అన్నారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమంలో కనిపించనని ఆయన చెప్పారని... ఆయన ఈ కార్యక్రమానికి రాబోరనే విషయాన్ని తాను ముందే చెప్పానని తెలిపారు. తామిద్దరం ఒక విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చిన అరుదైన సందర్భం ఇదేనని అన్నారు. కార్యక్రమానికి ట్రంప్ రాకపోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు.

అమెరికాకు ట్రంప్ ఒక ఇబ్బందికరమైన వ్యక్తిగా పరిణమించారని బైడెన్ అన్నారు. దేశానికి సేవ చేయడానికి అర్హత లేని వ్యక్తి ఆయన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పై తనకు ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయని... ఆయనపై తనకున్న అత్యంత దురభిప్రాయాన్ని కూడా ఆయన దాటిపోయారని విమర్శించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ అధ్యక్షులలో ట్రంప్ ఒకరని దుయ్యబట్టారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

మరోవైపు ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆయన మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అత్యంత భద్రత కలిగిన ఆ భవనం మూడో అంతస్తు వరకు వారు చేరుకున్నారు. వారిని నిలువరించే క్రమంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

 ఈ ఘటనపై యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ప్రజాస్వామ్యంపైనే దాడిగా ఈ ఘటనపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీని వెనుక ట్రంప్ హస్తం ఉందని కూడా పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జనవరి 20 కంటే ముందుగానే ట్రంప్ ను పదవీచ్యుతుడిని చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.


More Telugu News