మహారాష్ట్ర ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన.. అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువుల మృతి

  • భండారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • ఎస్ఎన్‌సీయూలోని 17 మంది చిన్నారుల్లో 10 మంది మృతి
  • తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఇక్కడి నాలుగు అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. మిగతా ఏడుగురిని అధికారులు రక్షించారు. వీరంతా నెల రోజుల నుంచి మూడు నెలల లోపున్న చిన్నారులే కావడం గమనార్హం.

ఏడుగురు చిన్నారులను రక్షించామని, పదిమంది చనిపోయారని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే తెలిపారు. నవజాత శిశువుల యూనిట్‌లో పొగ రావడాన్ని తొలుత ఓ నర్సు గుర్తించినట్టు చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.


More Telugu News