బీజేపీ కన్నెర్ర చేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయి: జీవీఎల్

  • ఏపీలో ఆలయాలపై దాడులు
  • ఘటనలు పెరిగిపోతుండడం పట్ల జీవీఎల్ ఆందోళన
  • ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణ
  • వైసీపీ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యలు
ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు పెరిగిపోతుండడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట పడడంలేదని అన్నారు. ఆకతాయిల పని అంటూ ప్రచారం చేసి, చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన రామతీర్థం ఘటనపై అన్ని వర్గాలు ఆవేదన చెందాయని వివరించారు.

దాడులపై చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవీఎల్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటివరకు దాడుల ఘటనల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలని నిలదీశారు. రామతీర్థం వెళ్లాలంటే బీజేపీ నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కన్నెర్ర చేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని హెచ్చరించారు.

నిన్న రామతీర్థం వద్ద జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని వెల్లడించారు. కిషన్ రెడ్డి కూడా సోము వీర్రాజును అడిగి వివరాలు తెలుసుకున్నారని, అమిత్ షాకు కూడా వినతిపత్రం ద్వారా పరిస్థితి వివరిస్తామని జీవీఎల్ చెప్పారు.  హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News