చెత్తకుండిలో రూ.15 వేలు దొరికితే.. పట్టుకెళ్లి ఇచ్చేసిన పారిశుద్ధ్య కార్మికుడు!

  • చెన్నై అడయారు మండలం 181వ వార్డులో ఘ‌ట‌న‌
  • బీచ్‌రోడ్డులో చెత్తను సేకరిస్తుండగా పార్శిల్ క‌న‌ప‌డ్డ వైనం
  • దాన్ని విప్పి చూస్తే అందులో డ‌బ్బులు
  • ఆ నగదు ఎవ‌రిదో తెలుసుకుని వెళ్లి ఇచ్చిన కార్మికుడు
ప‌క్క వారి సొమ్మునూ వారికి తెలియ‌కుండా కాజేస్తూ మ‌నుషులు బ‌తుకుతోన్న రోజులివి. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా డ‌బ్బు మీద ఆశ‌తో ఎన్నో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. ఇటువంటి స‌మాజంలోనూ ఇంకా మంచి మ‌నుషులు మిగిలే ఉన్నార‌ని నిరూపించాడు ఓ పారిశుద్ధ్య కార్మికుడు. చాలీచాల‌ని జీతంతో బ‌తుకు ఈడుస్తున్న‌ప్ప‌టికీ ప‌రుల సొమ్ముపై అతను ఆశ‌లు పెంచుకోలేదు.

నిజాయతీకి నిలువుట‌ద్దంలా నిలిచాడు. త‌న నిజాయితీని చాటుకుని అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచాడు. త‌మిళ‌నాడులోని చెన్నై అడయారు మండలం 181వ వార్డు కార్పొరేషన్‌ పారిశుద్ధ్య‌ కార్మికుడు ఎన్.మూర్తి బీసెంట్‌నగర్‌లో ప‌నులు చేస్తున్నాడు. బ్యాటరీ వాహనంలో చెత్తను సేకరించి తీసుకెళ్తుంటాడు. ఇటీవ‌ల‌ శాంతినగర్‌ బీచ్‌రోడ్డులో చెత్తను సేకరిస్తుండగా ఓ పార్శిల్‌ కంటపడ‌డంతో దాన్ని విప్పి చూశాడు.

అందులో రూ.15వేల నగదు ఉండ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాడు. దీంతో ఈ విష‌యాన్ని ఆ వార్డు మేనేజర్‌ సెల్వంకు చెప్పాడు. ఆయ‌న‌తో  కలిసి ఆ నగదు ఎవ‌రిదో తెలుసుకుని, ఆ  పార్శిల్ ను పడవేసిన వ్య‌క్తి ఇంటికి వెళ్లాడు. ఆ డబ్బుని అత‌డికి అప్ప‌గించాడు.  దీంతో అధికారులు మూర్తిని స‌న్మానించి, రూ.5 వేలను బహుమతిగా అందజేశారు.


More Telugu News